: హనీమూన్ ఇలా ట్రై చేయండి!
సంపన్నుల ఇంట పెళ్ళి వేడుక తర్వాత హనీమూన్ సర్వసాధారణం. ప్రస్తుతం ఎగువ మధ్యతరగతి కుటుంబాల్లోనూ ఈ కల్చర్ ప్రవేశించింది. ఆ విషయం అలా ఉంచితే, హనీమూన్ అంటే మనకు తెలిసి ఏ ఊటీకో, కొడైకెనాల్ కో... బాగా ధనికులైతే యూరప్ దేశాలకో, మారిషస్, థాయ్ లాండ్ వంటి ఆసియా దేశాలకో వెళతారు. ఇప్పటి యువత అభిరుచుల్లో మార్పులు వేగంగా చోటు చేసుకుంటున్నాయి. మరి, మారుతున్న కాలానికి అనుగుణంగా డిఫరెంట్ స్టైల్లో హనీమూన్ ఎలా సెలబ్రేట్ చేసుకోవచ్చో చూద్దాం. బైక్, లేక, కార్లో లాంగ్ డ్రైవ్ వెళ్ళండి. అది విశాలమైన రోడ్డు కావచ్చు, పర్వత ప్రాంతంలోని ఇరుకైన ఘాట్ రోడ్డు కావచ్చు, లేక, నదీతీరం వెంబడి మామూలు రహదారి కావొచ్చు... దంపతులు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇలాంటి ప్రయాణాలు ఉపకరిస్తాయి. ఓ లగ్జరీ హోటల్లో సూట్ బుక్ చేసుకోవడం, అక్కడి ఇంద్ర భోగాలను అనుభవించడం రొటీన్. అందుకు భిన్నంగా, పర్వత ప్రాంతాల్లో ట్రెక్కింగ్ కు వెళ్ళండి, లేదా, అడవుల్లో క్యాంపు వేయండి. అక్కడే వండుకోండి, తినండి. రాత్రివేళ... ఆకాశం నక్షత్రాల కాంతితో వెలిగిపోతున్న వేళ... ప్రత్యేకమైన మధుర భావాలేవో తప్పక పలకరిస్తాయి. వాహ్.. వాటే రొమాన్స్! అని ఆ తర్వాత మీరే అంటారు. మాల్దీవులు, మారిషస్, బ్యాంకాక్... ఎప్పుడు ఇవేనా? కాస్తంత, వైవిధ్యం కోసం ప్రయత్నించండి. కొత్త లొకేషన్లు ట్రై చేయండి. ఆయా ప్రదేశాల స్థానిక వంటకాలను రుచి చూడండి. అక్కడివారి సంస్కృతిని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. తద్వారా మీ ఆలోచనా పరిధి విస్తృతమవుతోంది. భాగస్వామిని సరిగా అర్థం చేసుకోవడంలో ఇది ఎంతగానో తోడ్పడుతుంది. హనీమూన్ కు వెళ్ళేముందు దంపతులకు పెద్దవాళ్ళు ఎన్నో జాగ్రత్తలు చెబుతారు. అయితే, వారి జాగ్రత్తలు పాటిస్తూనే, కాసింత అడ్వెంచర్ జోడించండి మీ హనీమూన్ ట్రిప్ కు. స్కై డైవింగ్, పారా గ్లైడింగ్, డీప్ సీ డైవింగ్ వంటి సాహస క్రీడల్లో పాల్గొనాలంటే శిక్షణ తప్పనిసరి. హనీమూన్ ట్రిప్ సందర్భంగా ఇలాంటి అడ్వెంచరస్ స్పోర్ట్ ట్రైనింగ్ లో పాల్గొనండి. కఠిన సమయాల్లో ఒకరి సాహచర్యం మరొకరికి ఎంత అవసరమో ఈ శిక్షణ కాలంలో అర్థమవుతుంది.