: ఢిల్లీ సీఎం పీఠంపై బీజేపీ నేత?
కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ, ఆ తర్వాత హర్యానా, మహారాష్ట్రల్లో పాలన పగ్గాలను చేజిక్కించుకుంది. ఇప్పటికే హర్యానా సీఎంగా ఆ పార్టీ నేత మనోహర్ లాల్ ఖట్టర్ పదవీ బాధ్యతలు చేపట్టగా, మహారాష్ట్రలో సీఎంగా బాధ్యతలు చేపట్టే నేతను నేడు పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించనున్నారు. ఇక ఫిబ్రవరి నుంచి ఖాళీగా ఉన్న ఢిల్లీ సీఎం పీఠం కూడా బీజేపీ ఖాతాలో చేరేందుకు రంగం సిద్ధమవుతోంది. అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సూచనతో సభలో మెజారిటీ నిరూపించుకోవాలని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ బీజేపీని కోరారు. ప్రస్తుతం 29 మంది ఎమ్మెల్యేలున్న ఈ పార్టీ ఢిల్లీ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా కొనసాగుతోంది. గత డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో మెజారిటీకి అతి సమీపంలోకి వచ్చిన బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యను మాత్రం సాధించలేకపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు ఆ పార్టీ నిరాకరించింది. దీంతో కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, 49 రోజుల్లోనే సీఎం పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఆ పదవిలో బీజేపీ నేత కూర్చునేందుకు మార్గం సుగమమవుతోంది.