: చర్చలకు సిద్ధమే: తెలంగాణలో దిగొచ్చిన జూడాలు
ప్రభుత్వంతో తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. సమ్మె విరమించాలని అటు తెలంగాణ సర్కారుతో పాటు హైకోర్టు కూడా జూడాలకు ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరకపోతే జూడాలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో వైద్య సేవల్లో తలెత్తుతున్న ఇబ్బందుల నేపథ్యంలో జూడాలు సమ్మె విరమించి, విధుల్లో చేరాలని హైకోర్టు కూడా సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం కఠిన చర్యల దిశగా అడుగులేస్తున్న క్రమంలో నెలరోజులగా మొండి పట్టుదలతో సమ్మె చేస్తున్న జూడాలు దిగిరాకతప్పలేదు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగానే ఉన్నామని ప్రకటించిన జూడాలు, గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించేందుకు తమకు అభ్యంతరం లేదని ప్రకటించారు. దీంతో నేడు జూడాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.