: ‘ఆ నలుగురు’లో ప్రణీత్ కౌర్ ఒకరు!
నల్ల కుబేరుల జాబితాలో కాంగ్రెస్ కు చెందిన నలుగురు నేతలున్నారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఆ నలుగురు ఎవరంటూ సోమవారం నుంచి చర్చోపచర్చలు జరుగుతున్నాయి. మంగళవారం నాటికి ఓ నేతాశ్రీ పేరు మాత్రం వెలుగులోకి వచ్చింది. ఆ నలుగురిలో తన పేరు ఉండే అవకాశాలున్నాయని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సతీమణి, కేంద్ర మాజీ మంత్రి ప్రణీత్ కౌర్ స్వయంగా వ్యాఖ్యానించారు. "ఆదాయపన్ను శాఖ నన్ను విచారించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది" అని కౌర్ అన్నారు. అయితే ఆదాయపన్ను శాఖ భావిస్తున్నట్లుగా విదేశీ బ్యాంకుల్లో తన పేరుపై ఎలాంటి బ్యాంకు ఖాతా లేదని ఆమె చెప్పారు. మరి ‘ఆ నలుగురు’ కాంగ్రెస్ నేతలు ఎవరన్న విషయం నేడో, రేపో వెల్లడయ్యేదాకా ప్రణీత్ కౌర్ ప్రకటనపైనే కీలక చర్చ నడవనుంది.