: భారత్ లో రూ.60 వేల కోట్ల పెట్టుబడులు: జపాన్ అపర కుబేరుడి ప్రకటన


రానున్న కొన్నేళ్లలో భారత్ లో రూ.60 వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు జపాన్ కుబేరుడు మసయోషి సన్ ప్రకటించారు. టెలికాం, ఇంటర్నెట్ సేవల్లో జపాన్ అగ్రగామి సంస్థ సాఫ్ట్ బ్యాంక్ వ్యవస్థాపకుడిగానే కాక ఛైర్మన్ గానూ వ్యవహరిస్తున్న సన్, కేంద్ర కమ్యూనికేషన్లు, ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో భేటీ సందర్భంగా ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం భారత్ లో పర్యటిస్తున్న ఆయన తన పెట్టుబడులకు సంబంధించిన స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2000 సంవత్సరంలో చైనా ఈ-కామర్స్ సంస్థ అలీబాబాలో సన్ 20 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. భారత ఈ-కామర్స్ సంస్థ స్నాప్ డీల్ లోనూ 650 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టిన సన్, మెజారిటీ వాటాదారుగా కొనసాగుతున్నారు. ఇక ఒలాక్యాబ్స్ లోనూ 180 మిలియన్ డాలర్లను ఆయన పెట్టుబడిగా పెట్టారు. మొబైల్ అడ్వర్టైజింగ్ లో భారతీ ఎయిర్ టెల్ తో కలిసి ఇన్ మోబీ సంస్థను సాఫ్ట్ బ్యాంక్ నిర్వహిస్తోంది. భారత ఐటీ కంపెనీలు స్థిరమైన రాబడులతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు అందిస్తున్న వైనం సన్ ను ఆకట్టుకుంది.

  • Loading...

More Telugu News