: బీజేపీ, కాంగ్రెస్ లకు 'నల్ల కుబేర' మహిళ విరాళాలు!
నల్ల కుబేరుల జాబితాలో తొలుత వెలువడిన ముగ్గురి పేర్లలో ఒకరైన రాధా టింబ్లో నుంచి అధికార పార్టీ బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్ భారీ మొత్తంలో విరాళాలు అందుకున్నాయి. గోవాలో ప్రముఖ మైనింగ్ కంపెనీ సీఈఓగా కొనసాగుతున్న రాధా టింబ్లో నుంచి 2004-12 మధ్య బీజేపీ ఏకంగా రూ. 1.18 కోట్ల మేర విరాళాలు అందుకుంటే, ఇదే కాలంలో కాంగ్రెస్ పార్టీకి రూ.65 లక్షలు ముట్టాయి. ఈ మేరకు ఆ రెండు పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించిన ఏబీఆర్ లలో తెలిపాయి. ఎనిమిదేళ్ల కాలంలో టింబ్లో బీజేపీకి తొమ్మిది సార్లు విరాళాలు అందించారు. ఇక కాంగ్రెస్ కు ఆమె అందించిన మొత్తం మూడు విడతలుగా ఆ పార్టీకి చేరింది. బీజేపీకి ఇచ్చిన విరాళాల్లో మూడు దఫాలుగా రూ. 25 లక్షల చొప్పున ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, ఫెడరల్ బ్యాంక్ చెక్కుల ద్వారా టింబ్లో రూ.75 లక్షలను అందజేశారు. కేంద్రం వెల్లడించిన జాబితాలో తన పేరున్న విషయంపై స్పందించమన్న విలేకరుల ప్రశ్నకు, "కేంద్రం అఫిడవిట్ ను పరిశీలించిన తర్వాత మాట్లాడతాను" అంటూ టింబ్లో చెప్పారు.