: ఎన్నారై తెలుగు విద్యార్థిని అభినందించిన ప్రధాని
జమ్మూకాశ్మీర్ వరద బాధితుల కోసం విరాళాలు సేకరించిన ఎన్నారై తెలుగు విద్యార్థిని దువ్వూరి రోహిణి ప్రత్యూషను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. కువైట్ లోని భారతీయ విద్యాభవన్ లో 12వ తరగతి చదువుతున్న రోహిణి, వరద బాధితుల సహాయార్థం తరగతులు ముగిసిన తరువాత, కువైట్ లోని భారతీయుల ఇళ్లకు వెళ్లి 2.15 లక్షల రూపాయలు సేకరించి భారత రాయబార కార్యాలయానికి అందజేసింది. ఈ మొత్తాన్ని భారత ఎంబసీ ప్రధాని సహాయనిధికి పంపింది. రోహిణి చేసిన పనిని అభినందిస్తూ ప్రధాని మోదీ ఆమెకు లేఖ రాశారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి సహాయం చేసేందుకు రోహిణి చూపిన చొరవ ప్రశంసనీయమని ఆయన లేఖలో పేర్కొన్నారు.