: ముఖ్యమంత్రి పదవికి కళంకం తీసుకురావద్దు: కేసీఆర్ కు ప్రెస్ కౌన్సిల్ హితవు


జర్నలిస్టులు తెలంగాణ పక్షం వహించారా? లేదా? అన్న ప్రాతిపదికగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని, ఎంఎస్ వోలను వెనకేసుకురావడం ద్వారా ముఖ్యమంత్రి పదవికి కళంకం తీసుకురాకూడదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వేసిన ప్రత్యేక కమిటీ కేసీఆర్ కు హితవు పలికింది. టీవీ9, ఏబీఎన్ ఛానెళ్ల నిలిపివేతపై ఆ కమిటీ తన సిఫారసులను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలిపింది. జర్నలిస్టులను పక్షపాతంతో చూడకూడదని కమిటీ స్పష్టం చేసింది. పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి మాట్లాడడడం సరికాదని కమిటీ అభిప్రాయపడింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ఎంఎస్వోలను ఆదేశించి, టీవీ9, ఏబీఎన్ ఛానెళ్లను పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణ ముఖ్యమంత్రి నివాసం ఎదుట మహిళా జర్నలిస్టులు ఆందోళన నిర్వహిస్తే, వారిపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం సరికాదని స్పష్టం చేసింది. అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. మీడియాను ముఖ్యమంత్రి పాతరేస్తాననడం కేవలం ఏబీఎన్, టీవీ9 ఛానెళ్లనే కాకుండా మొత్తం మీడియాను లొంగదీసుకునేందుకు ప్రయత్నించడమేనని కమిటీ అభిప్రాయపడింది. ఈ నివేదికను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. దీనిని తెలంగాణ ముఖ్యమంత్రికి, ప్రధాన కార్యదర్శికి, కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర హోం శాఖకు పంపించనుంది.

  • Loading...

More Telugu News