: మోదీ, అమిత్ షాలను పొగుడుతూ శివసేన సంపాదకీయం
'తిట్టిన నోరు పొగడక మానదు' అన్న మాదిరిగా ఉంది మహారాష్ట్రలో శివసేన పార్టీ వ్యవహారం. అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు బీజేపీని చీల్చిచెండాడిన ఆ పార్టీ తాజాగా పొగడ్తలు మొదలుపెట్టింది. పార్టీ పత్రిక 'సామ్నా'లో రాసిన సంపాదకీయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలను పొగడ్తలతో ముంచెత్తింది. ఇందుకు కారణం ఆ పార్టీ ఎన్నికల్లో సాధించిన ఘన విజయమేనన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో "మహారాష్ట్ర ప్రజల ఆసక్తి మేరకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ ఎవరిని ఎంపిక చేసినా మేము మద్దతిస్తాం" అని సేన పేర్కొంది. అంతేకాదు, కమలదళం నేతృత్వంలో రాష్ట్ర పాలన సాగడం చాలా సంతోషమని తెలిపింది. మహారాష్ట్రలో ఈ విజయానికి కారణమైన మోదీ, అమిత్ షాలను కూడా ప్రశంసించింది.