: 'హెరిటేజ్' సోలార్ ప్లాంటుకు అనుమతివ్వని కేసీఆర్... మండిపడ్డ లోకేష్
టీడీపీ యువనేత నారా లోకేష్ కేసీఆర్ ద్వంద్వ వైఖరిపై మండిపడ్డారు. సిద్దిపేట రోడ్డులోని ములుగు వద్ద తమ సంస్థ హెరిటేజ్ ఒక సోలార్ ప్లాంటును ఏర్పాటు చేయదలచిందని... ఇందుకోసం రూ. 18 నుంచి 20 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ప్రణాళికలు రచించామని చెప్పారు. అయితే, టీఎస్ ప్రభుత్వం చేసిన కొన్ని విధానపరమైన మార్పుల వల్ల మొత్తం పెట్టుబడి పెట్టలేని పరిస్థితి ఏర్పడిందని... తమకు నిర్దిష్టమైన అనుమతులు కూడా మంజూరు చేయలేదని అన్నారు. ఓ వైపు రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని చెబుతున్న కేసీఆర్... మరోవైపు పవర్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకపోతే ఎలా? అని ప్రశ్నించారు. ఇలా ఐతే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని నిలదీశారు. ఎంతసేపూ ఎదుటి వారిని విమర్శించే కేసీఆర్... తన పద్ధతిని మార్చుకుని, అభివృద్ధి కోసం కృషి చేయాలని సూచించారు.