: విజయవాడకు వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం త్వరలో నవ్యాంధ్ర రాజధాని విజయవాడకు తరలిపోనుంది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా, తమ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని విజయవాడకు తరలించనున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు హైదరాబాద్ లోనే తమ ప్రధాన కార్యాలయాలను కొనసాగిస్తూనే విజయవాడలో కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. సీపీఎం, సీపీఐ, బీజేపీలు ఇప్పటిదాకా ఈ దిశగా నిర్ణయాలు తీసుకున్నాయి. ప్రధాన పార్టీలు టీడీపీ, కాంగ్రెస్ లు విజయవాడలోని తమ నగర శాఖ కార్యాలయాల్లోనే పార్టీ రాష్ట్ర కార్యకలాపాలపై సమీక్షలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటిదాకా నవ్యాంధ్రకు కొత్త కార్యాలయమంటూ ఏర్పాటు చేసుకోలేదు. నవ్యాంధ్ర రాజధానికి పార్టీ కేంద్ర కార్యాలయాన్ని తరలిస్తున్న తొలి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే!