: హెచ్ఎంటీ... మళ్లీ బతికినట్టే!
దేశీయ వాచీల తయారీలో తొలి కంపెనీగా వినుతికెక్కిన హెఎచ్ఎంటీ... దాదాపుగా బతికిపోయినట్టే. ఆ కంపెనీకి చెందిన అన్ని ప్లాంట్లను మూసేసినా, కనీసం ఒక్క ప్లాంటునైనా తిరిగి తెరవాలని కేంద్రం యోచిస్తోంది. దీంతో దాదాపుగా మూతపడిందనుకున్న హెచ్ఎంటీ కంపెనీకి కొత్తగా ప్రాణం లేచి వచ్చినట్లైంది. అయితే ఎక్కడి ప్లాంట్ ను తిరిగి ప్రారంభించాలన్న దానిపై కేంద్రం ఇంకా ఓ అంచనాకు రాలేదు. పెద్ద మొత్తంలో నష్టాలను కూడగట్టుకున్న హెచ్ఎంటీని మూసివేసేందుకు నిర్ణయం తీసుకోవడంతో పాటు సదరు నిర్ణయాన్ని అమలు చేసేసిన ప్రభుత్వం, తాజాగా ఈ కొత్త నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలపై ఆసక్తికర అంశం దాగుంది. హెచ్ఎంటీ కంపెనీని మూసివేస్తున్నట్లుగా వెలువడిన వార్తల నేపథ్యంలో సదరు కంపెనీ రూపొందించిన వాచీలకు భారీ డిమాండ్ వచ్చేసింది. అప్పటిదాకా ఉన్న రేటుకు రెట్టింపు రేటు పెట్టినా, కొనుగోలు చేసేందుకు వినియోగదారులు వెనుకాడలేదు. దీంతో చివరి కలెక్షన్ పేరిట కంపెనీ విడుదల చేసిన వాచీలు, మార్కెట్ లోకి విడుదలయ్యాయో లేదో, ఇట్టే అయిపోయాయి. దీనిని గమనించిన నేపథ్యంలోనే ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంటే, వినియోగదారుల్లో తనకున్న డిమాండ్ తోనే హెచ్ఎంటీ మళ్లీ జీవం నింపుకున్నదన్నమాట.