: బాబు, దేవినేని, పరకాలకు భాష అర్ధం కాకపోతే ఇంగ్లిష్ టీచర్ ని పంపుతా!: హరీష్ రావు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి దేవినేని ఉమ, ప్రత్యేక సలహాదారు పరకాల ప్రభాకర్ కు భాష అర్ధం కాకపోతే, జీవోలతో పాటు ఒక ఇంగ్లిష్ టీచర్ ని కూడా పంపుతానని తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జీవో నెంబర్ 69, 107, 233 పై గోబెల్స్ ప్రచారం చేస్తోంది ఎవరని ప్రశ్నించారు. జీవో నెంబర్ 69 ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టులో 834 అడుగుల నీటి మట్టం వరకు వినియోగించుకోవచ్చని నిర్దేశించారని ఆయన స్పష్టం చేశారు. నిర్దేశించిన మేరకు ఉన్న జలాలనే తాము వినియోగించుకుంటున్నామని ఆయన స్పష్టం చేశారు. 841 అడుగుల ఎత్తున ఉన్న పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీకి నీటి కోసం 107 జీవో వచ్చిందని ఆయన తెలిపారు. అందుకోసమే ఆ జీవోలో 854 అడుగుల నీటి మట్టం ఉంచాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. అయితే వాటన్నింటికీ క్లారిటీ ఇస్తూ 2005లో జీవో 233 వచ్చిందని ఆయన చెప్పారు. దాని ప్రకారం పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా నీరు తీసుకుపోవాలి. వారి అవసరాలు తీరిన తర్వాత 834 అడుగుల వరకు నీరు వినియోగించుకోవచ్చు అని 2005లో జీవో వచ్చిందని ఆయన స్పష్టం చేశారు. 107 జీవో రద్దుకు పోరాటం చేసింది టీడీపీయేనని ఆయన చెప్పారు. 107 జీవోను సవరిస్తూ 233 జీవో వచ్చిందని ఆయన వివరించారు. 107ను మెరుగుపరుస్తూ 233 జీవో వచ్చిందన్న విషయం ఆ ముగ్గురు నేతలు తెలుసుకోవాలని ఆయన సూచించారు. ఆ జీవోలన్నీ డెల్టా, సీమల్లో పైచేయి కోసం నేతలు జారీ చేసినవేనని ఆయన వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడూ తెలంగాణను పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఆయా జీవోలకు లోబడి తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అందుకే ఇవాళ కూడా పోతిరెడ్డి పాడుకు నీరు వెళ్లిందని ఆయన వివరించారు. జీవో నెంబర్ 69, 107 గురించి మాట్లాడుతున్న టీడీపీ నేతలు జీవో 233 గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో బచావత్ గారు మాట్లాడుతూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఉండి ఉంటే ఎక్కువ నీరు వచ్చి ఉండేదని అన్నారని ఆయన గుర్తు చేశారు. 'జీవోలు ఉల్లంఘించింది మీరు, తెలంగాణా ప్రభుత్వం మాత్రం వాటికి లోబడే పనిచేస్తోంది' అని హరీష్ రావు తేల్చిచెప్పారు.