: పంచకుల అద్దె ఇంటిలో చోరీ...మోదీ మొబైల్ ఫోన్, టీవీల అపహరణ!
పంచకుల అద్దె ఇల్లేంటి? మోదీ మొబైల్ ఫోన్, టీవీలు చోరీకి గురి కావడమేమిటనేగా సందేహం. ఓ 20 ఏళ్ల వెనక్కెళితే గాని ఆ విషయం మనకు బోధపడదు. 1992-1999 మధ్యలో మోదీ పంచకులలో ఉన్నారు. బీజేపీ నేత మహావీర్ కు చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్న ఆయన ఏడేళ్ల పాటు అదే ఇంటిలో ఉన్నారు. 1995లో మోదీ లేని సమయంలో ఆ ఇంటిలో చోరీ జరిగిందట. ఆ సందర్భంగా దొంగలు మోదీకి చెందిన మొబైల్ ఫోన్ తో పాటు టీవీ, కుర్తా-పైజామా, బ్లాంకెట్లను ఎత్తుకెళ్లారట. ఇదిలా ఉంటే, ప్రస్తుతం హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా మనోహర్ లాల్ ఖట్టర్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరిగిన మేళా మైదానానికి సదరు ఇల్లు సమీపంలోనే ఉందట. ఖట్టర్ ప్రమాణ స్వీకారోత్సవానికి మోదీ హాజరవుతున్నారు. అయితే బిజీ షెడ్యూల్ కారణంగా మోదీ, ఆ ఇంటిని సందర్శించలేకపోతున్నారు. ఒకవేళ ఆ ఇంటిని సందర్శిస్తే మాత్రం, నాటి చోరీ ఘటన మోదీ మదిలో మెదలక తప్పదేమో!