: శివసేనతో పొత్తు లేకుండానే ‘మహా’ ప్రభుత్వం: బీజేపీ కార్యకర్తల మనోభావమిదేనట!


మహారాష్ట్ర ఎన్నికల్లో సీట్ల సర్దుబాటులో మొండిగా వ్యవహరించి, పార్టీ ఒంటరిపోరుకు కారణమైన శివసేనతో కలసి ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ కార్యకర్తల మనసొప్పడం లేదట. నాడు సీట్ల సర్దుబాటులో, నేడు కేబినెట్ బెర్తుల పంపకాల్లో శివసేన మొండిగా వ్యవహరిస్తూ తమ సహనాన్ని పరీక్షిస్తోందని సగటు బీజేపీ కార్యకర్త ఆగ్రహావేశాలతో ఊగిపోతున్నాడు. మహారాష్ట్ర సీఎం పోస్టును తమకే ఇవ్వాలని కూడా శివసేన ఒకానొక దశలో పట్టుబట్టిన వైనాన్ని పార్టీ కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. ఒంటరిగానే బరిలోకి దిగి అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ఎన్సీపీ మద్దతుతో సొంతంగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పార్టీ కార్యకర్తలు భావిస్తున్నారట. ఇదే విషయాన్ని తమ నేతాశ్రీలకు నూరిపోస్తున్నారట. మద్దతు కోసం శివసేన చుట్టూ చక్కర్లు కొట్టాల్సిన ఖర్మ తమకేమీ పట్టలేదని, ఎలాగూ అడగకముందే మద్దతు ప్రకటించిన ఎన్సీపీ బయటి నుంచే సహకరించేందుకు సిద్ధంగా ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు ప్రస్తావిస్తున్నారు. అంతేకాక తమతో దోస్తీ కోసం ఎన్సీపీ తహతహలాడుతున్న తీరు కూడా వారిని ఆ దిశగా ఆలోచింపజేసిందనే చెప్పాలి.

  • Loading...

More Telugu News