: నేడు ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోదీ విందు!


ప్రధాని నరేంద్ర మోదీ నేడు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన పార్లమెంట్ సభ్యులకు విందు ఇవ్వనున్నారు. దివాలీ మిలాన్ ను పురస్కరించుకుని ఏర్పాటు కానున్న ఈ విందుకు ఎన్డీఏలోని మిత్ర పక్ష పార్టీల ఎంపీలతో పాటు ఆయా పార్టీల అధ్యక్షులు కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేబినెట్ భేటీ సందర్భంగా తన కేబినెట్ సహచరులకు విందుతో మోదీ మొదలుపెట్టిన విందు రాజకీయాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న దేశ సరిహద్దులోని సియాచిన్ గ్లేసియర్ వద్ద సైనికులతో కలసి దీపావళి వేడుకలను ఉల్లాసంగా జరుపుకున్న మోదీ, శనివారం మీడియా ప్రతినిధులతో పార్టీ కార్యాలయంలో సరదాగా గడిపారు. మీడియా సమావేశం లాగా కాకుండా అందరితో కలసిపోయి ఆయన వ్యవహరించిన తీరు ఆకట్టుకుంది. అలాగే, బీజేపీకి చెందిన అధికారిక ఫొటోగ్రాఫర్ నుంచి మోదీ కెమేరా తీసుకుని, అతనిని ఫొటోలు తీసిన వైనం అందర్నీ ఆకట్టుకుంది. ఇక నేడు మోదీ ఏర్పాటు చేస్తున్న విందు పలు ముఖ్య అంశాలకు వేదిక కానుంది. ఈ విందుకు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే హాజరైతే, ఇరు పార్టీల మధ్య మళ్లీ పొత్తు పొడిచినట్లే. మహారాష్ట్రలో ఆ రెండు పార్టీల తరఫున ప్రభుత్వం ఏర్పడటం ఖాయమే. మరోవైపు తమిళ నాడు రాజకీయ నేతలు వైగో, విజయకాంత్ లకు ఆహ్వానాలు అందని అంశం కూడా ఈ విందు సందర్భంగా ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News