: స్కూటర్ నడిపి వివాదంలో ఇరుక్కున్న నితిన్ గడ్కరీ!
ఎక్కడికి వెళ్లినా తన కాన్వాయ్ కారులో వెళ్లే కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈసారి భిన్నంగా స్కూటర్ పై దర్శనమిచ్చారు. ఈరోజు మంత్రి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ను కలిసేందుకు నాగ్ పూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి ఆయన వెళ్లారు. విశేషం ఏమిటంటే, తెల్లని రంగులో ఉన్న స్కూటర్ ను స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ గడ్కరీ వెళ్లారు. మంత్రికి తోడుగా వెనక సీట్లో అంగరక్షకుడు ఉన్నాడు. ఈ సమయంలో గడ్కరీ చాలా ఉత్సాహంగా వెళుతుండగా చూసిన వారంతా ఆశ్చర్యపోయారు. అయితే, ఈ విషయం కాస్తా చిన్నపాటి వివాదం అయింది. స్కూటర్ నడుపుతున్న సమయంలో హెల్మెట్ పెట్టుకోకుండా నిబంధనలు ఉల్లంఘించారేమిటని పాత్రికేయులు అడగ్గా మాట్లాడేందుకు మంత్రి తిరస్కరించారు. అటు ఈ విషయంపై కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ దిగ్విజయ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. వేరెవరైనా ఇలా చేస్తే చిన్న విషయం అనుకోవచ్చు, అయితే స్వయంగా రవాణా శాఖ మంత్రే ఇలా ప్రవర్తించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు.