: మోదీ డిన్నర్ కు వీరికి ఆహ్వానాలు అందలేదు!
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్డీయే భాగస్వాములకు ఆదివారం విందు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తమిళ మిత్రులు డీఎండీకే, ఎండీఎంకే పార్టీలకు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఆహ్వానాలు వెళ్ళలేదట. డీఎండీకే అధినేత విజయకాంత్, ఏండీఎంకే అధ్యక్షుడు వైగోలను ప్రమాణస్వీకారం నాడు ప్రత్యేకంగా పిలిచిన మోడీ, ఈసారి వారిద్దరినీ దూరం పెట్టడంపై రాజకీయవర్గాల్లో ఊహాగానాలు బయల్దేరాయి. దీనిపై, తమిళనాడు బీజేపీ ఉపాధ్యక్షుడు ఎం.చక్రవర్తి వివరణ ఇచ్చారు. మోదీ కేవలం ఎంపీలకే విందు ఏర్పాటు చేశారని తెలిపారు. అందుకే, ఎన్డీయే మిత్రపక్షమైన పీఎంకే ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అన్బుమణి రాందాస్ ఒక్కరికే ఆహ్వానం అందిందని తెలిపారు. ఇక, రాష్ట్రం నుంచి బీజేపీ తరపున ఎన్నికైన ఏకైక ఎంపీ, కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ కూడా ఈ విందుకు హాజరవుతారు. కాగా, విజయ్ కాంత్ డీఎండీకే, వైగో ఎండీఎంకే సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయాయి.