: 'పాకిస్థాన్ అధ్యక్షుడు మన్మోహన్ సింగ్' అని పేర్కొన్న పాక్ ఎకనామిక్స్ ఇన్ స్టిట్యూట్
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఉన్న 'పాకిస్థాన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డెవలప్ మెంట్ ఎకనామిక్స్' (పీఐడీఈ) ఈ నెల 28న స్నాతకోత్సవం జరుపుకోనుంది. ఈ కార్యక్రమానికి వారు పాక్ అధ్యక్షుడు మమ్నూన్ హుస్సేన్ ను ఆహ్వానించాలని నిర్ణయించారు. ఆయన అధ్యక్షతన స్నాతకోత్సవం జరపాలని సంస్థ భావించింది. అయితే, ఆహ్వాన పత్రాల్లో 'ప్రెసిడెంట్ ఆఫ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్థాన్, మన్మోహన్ సింగ్' అని పేర్కొన్నారు. దున్యా న్యూస్ మీడియా సంస్థ ఈ ఘోర తప్పిదాన్ని ఎత్తిచూపింది. తప్పును గుర్తించి నాలుక్కరుచుకున్న పీఐడీఈ అధికారులు వెంటనే దాన్ని సవరించారు. అయితే, అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఎంతోమంది ప్రముఖులకు ఆహ్వాన పత్రాలు వెళ్ళిపోయాయి. దీనిపై వ్యాఖ్యానించడానికి పీఐడీఈ అధికారులెవరూ అందుబాటులోకి రాలేదు.