: ఈనె 28 న ముహూర్తం... మరాఠా కోటలో బీజేపీ పాగా
మరాఠా కోటలో బీజేపీ పాగా వేసేందుకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 28న మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తరహాలో తొలుత ఐదుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి, తరువాత కేబినెట్ విస్తరణ చేపట్టనున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావును కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. 288 అసెంబ్లీ స్థానాలు కలిగిన మహారాష్ట్రలో 122 స్థానాలను గెలుచుకున్న బీజేపీకి మరో 22 మంది సభ్యుల మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో బీజేపీ మిత్రపక్షం రాష్ట్రీయ సమాజ్ పక్ష్ ఒక్క స్థానంలో మాత్రమే విజయం సాధించింది. తాజా పరిణామాల నేపథ్యంలో, దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా, 63 స్థానాలు గెలుచుకుని సత్తా చాటిన శివసేన వైపు బీజేపీ మొగ్గుచూపినట్టు సమాచారం. శివసేన అడిగిన మంత్రి పదవులు ఇచ్చేందుకు కూడా బీజేపీ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో 42 స్ధానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం పాత్ర పోషించనుంది.