: ఐఏఎస్ లతో పాటు ప్రైవేట్ రంగ నిపుణులకూ సర్కారీ కీలక పదవులు
ఆర్థిక శాఖ కార్యదర్శి, పర్యావరణ శాఖ కార్యదర్శి, పరిశ్రమల శాఖ కార్యదర్శి, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి, ఇంధన శాఖ కార్యదర్శి... ప్రభుత్వంలో కీలక పోస్టులైన ఈ తరహా పదవులన్నీ ఇప్పటిదాకా ఐఏఎస్ లే నిర్వహిస్తున్నారు. కొందరికి అన్ని అంశాలపై పట్టున్నా, మరికొందరికి ఆయా విషయాలపై పూర్తి స్థాయి పరిజ్ఞానం లేదనే చెప్పాలి. అయితే మోదీ సర్కారు ఈ పద్దతికి తిలోదకాలివ్వనుంది. ప్రభుత్వంలోని కీలక పదవుల్లో ఆయా అంశాలపై విశేష అనుభవమున్న ప్రైవేట్ సంస్థల ఉద్యోగులనూ నియమించేందుకు సన్నాహాలు చేస్తోంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దీనిపై ప్రకటన చేసిన మోదీ, తాజాగా దానిని ఆచరణలో పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖను పూర్తిగా తన అధీనంలోకి తీసుకోనున్న మోదీ, వెనువెంటనే ఆయా రంగాల్లో విశేష అనుభవమున్న వారికి కీలక పదవులను కట్టబెట్టనున్నట్లు విశ్వసనీయ సమాచారం. మోదీ నిర్ణయాన్ని పలువురు సీనియర్ ఐఏఎస్ లతో పాటు రిటైర్డ్ ఐఏఎస్ లు కూడా స్వాగతిస్తుండటం గమనార్హం.