: 'ఇసిస్' గ్రూపు సంపాదన రోజుకు రూ. 6 కోట్లు!


ఇరాక్, సిరియాల్లో భీకర దాడులకు పాల్పడుతున్న 'ఇసిస్' ఉగ్రవాద సంస్థ, ప్రపంచంలోనే అత్యంత ధనిక సంస్థగా ఆవిర్భవించనుంది. రోజుకు రూ.6 కోట్ల సంపాదనతో శరవేగంగా పెరుగుతున్న ఆ సంస్థ ఆస్తులు అగ్రరాజ్యం అమెరికాను కూడా కలవరపెడుతున్నాయి. ఇరాక్, సిరియాల్లో తన స్వాధీనంలోకి తీసుకున్న ప్రాంతాల్లోని చమురు బావుల ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఇసిస్, బెదిరింపుల ద్వారాను పెద్ద ఎత్తున కూడగడుతోందని అమెరికా ఆర్థిక శాఖలో ఉగ్రవాదం, ఆర్థిక నిఘా విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న డేవిడ్ కోహెన్ గురువారం వ్యాఖ్యానించారు. గతంలో ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా అత్యంత ధనిక ఉగ్రవాద సంస్థగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఇసిస్ ఆస్తుల విలువ, అల్ ఖైదా ఆస్తులను మించిపోనుందని సమాచారం. ఈ నేపథ్యంలో, ఆ సంస్థను నిలువరించేందుకు సుదీర్ఘ సమరమే చేయాల్సి ఉందని కూడా కోహెన్ చెబుతున్నారు. నిత్యం సమకూరుతున్న భారీ ధనంతో ఇసిస్ పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుంటోందని తెలుస్తోంది. ఇదే తరహాలో ఆ సంస్థ ఎదిగితే ప్రపంచానికి తీవ్ర ముప్పు తప్పదని కోహెన్ హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News