: అందరికీ దీపావళి ... వీళ్లకు మాత్రం 'కష్టా'వళి!


కులమత భేదాల్లేకుండా అందరూ ఇష్టంగా జరుపుకునే పండుగల్లో దీపావళి ప్రముఖమైనది. ఈ పండుగకు కొత్త డ్రెస్సులు, బంగారు ఆభరణాలు, ఇతర వస్తువులు కొనడాన్ని అత్యధికులు సెంటిమెంట్ గా భావిస్తారు. మొత్తమ్మీద దీపావళిని పురస్కరించుకుని షాపింగ్ ఎక్కువగా జరుగుతుంది. ఇ-కామర్స్ రంగప్రవేశం తర్వాత ఆన్ లైన్ షాపింగ్ కు ప్రజలు బాగా అలవాటు పడ్డారు. కంప్యూటర్ ముందు కూర్చుని, ఒక్క క్లిక్ తో, కోరుకున్న వస్తువును ఇంటికి తెప్పించుకుంటున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. వినియోగదారుడికి వస్తువులను డెలివరీ చేసే బాయ్స్ గురించి కాస్త ఆలోచిద్దాం. దీపావళి వస్తుందంటే చాలు, వీళ్ళు హడలిపోతారు. ప్రజలు తమ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు బుక్ చేస్తారు. పాపం, అవి మోయలేక వీళ్ళ వెన్నెముకలు వంగిపోతాయి. 40 కేజీల బరువును వీపుపై పెట్టుకుని, లిఫ్ట్ సౌకర్యం లేని చోట మెట్లు ఎక్కడాన్ని ఊహించుకోండి! ఆ కష్టం ఎలాంటిదో అనుభవించిన వారే చెప్పగలరు. దీర్ఘకాలంలో ఇలా వీపుపై అధిక బరువును మోయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు డాక్టర్లు. డిస్క్ సమస్యలు, భుజం నొప్పి వంటి తీవ్ర సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సంతోష్ యాదవ్ అనే డెలివరీ బాయ్ ఏమంటున్నాడో వినండి. దీపావళి సందర్భంగా ఎంతోమంది ఆన్ లైన్ ఆర్డర్లు బుక్ చేస్తారని, తద్వారా తమ పని గంటలు పెరుగుతాయని వివరించాడు. మినీ వ్యాన్లు అయితే ట్రాఫిక్ లో చిక్కుకుంటాయన్న కారణంతో.... కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, ప్రింటర్లు తదితర వస్తువులను తమతో డెలివరీ చేయిస్తారని వాపోయాడు. రషీద్ అనే మరో డెలివరీ బాయ్ మాట్లాడుతూ, తనకు డ్రైవింగ్ తెలుసని, భవిష్యత్తులో కమర్షియల్ డ్రైవర్ గా వెళతానని చెప్పాడు. ఈ బరువులు మోసే ఉద్యోగం ఎక్కువకాలం చేయలేనని స్పష్టం చేశాడు.

  • Loading...

More Telugu News