: ల్యాండ్ ఫోన్లకు మళ్ళీ మహర్దశ పట్టనుందా?
ఒకప్పుడు ల్యాండ్ ఫోన్ ఆ ఇంటి యజమాని ప్రతిష్ఠకు సంబంధించిన విషయం. తర్వాత్తర్వాత అది దాదాపు ప్రతి ఇంట్లోనూ స్థానం సంపాదించుకుంది. కానీ, సెల్ ఫోన్ విప్లవం ధాటికి ఆ 'రింగ్' మూగబోయింది. ఇప్పుడెక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లు. ఇవి పర్ఫెక్ట్ అనుకోవడానికి లేదు. వీటితోనూ చాలా సమస్యలున్నాయన్నది ప్రజల మాట. కొన్నిసార్లు సిగ్నల్ లేక కాల్ అందుకోలేరు, చేయలేరు. కాల్ వస్తే ఏ బాల్కనీలోకో, డాబాపైకో వెళ్ళి మాట్లాడుకుని రావాల్సిన పరిస్థితి! వాయిస్ నాణ్యత కొన్నిసార్లు దారుణంగా ఉంటుంది. అవతలి వ్యక్తి ఏం చెబుతున్నాడో అర్థం కాదు. అర్థం చేసుకునేలోపు కాల్ కట్ అయిపోతుంది. ఏవైనా ముఖ్యమైన కాల్స్ అయితే, జరిగే నష్టం పలు రూపాల్లో ఉంటుంది. ఇక, ఫోన్ లో ఇంటర్నెట్ కూడా ఇలాగే ఇబ్బందులకు గురిచేస్తుంది. మొబైల్ యూజర్ల సంఖ్య పెరిగినా, దానికి తగ్గట్టుగా ఆపరేటర్లు వ్యవహరించకపోవడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. 2009 మార్చి నాటికి భారత్ లో 391 మిలియన్ల మంది యూజర్లుండగా, ఈ ఏడాది మార్చి నాటికి వారి సంఖ్య 900 మిలియన్లకు చేరింది. పెరిగిన యూజర్లకు అనుగుణంగా, టవర్లు కూడా అదే స్థాయిలో ఏర్పాటు చేయాల్సి ఉండగా, 2010-2014 మధ్య 41 శాతం మాత్రమే అదనపు టవర్లను ఏర్పాటు చేశారు. దీంతో, అంతంతమాత్రం నెట్వర్క్ తో యూజర్లు ఇబ్బందులపాలవుతున్నారు. ఇప్పుడీ మొబైల్ సమస్యలకు పరిష్కారంగా, అందరి దృష్టి మళ్ళీ ల్యాండ్ ఫోన్లపైకి మళ్ళింది. ల్యాండ్ ఫోన్ అయితే వాయిస్ స్పష్టంగా వినిపించడంతో పాటు, కాల్ కట్టవడం వంటి సమస్యలుండవని అత్యధికులు భావిస్తున్నారు. పైగా, ఇంటర్నెట్ సౌకర్యం కూడా మెరుగైన రీతిలో అందుబాటులో ఉంటుంది.