: కేసీఆర్ కు పరిపాలనా దక్షత లేదు... ఆ పార్టీవి చిల్లర రాజకీయాలు: బీజేపీ


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక అసమర్థుడని బీజేపీ తెలంగాణ నేత కృష్ణసాగర్ అన్నారు. కేసీఆర్ అసమర్థతతోనే తెలంగాణలో విద్యుత్ కష్టాలు మొదలయ్యాయని తెలిపారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేసి తీరుతామని టీఎస్ మంత్రి హరీష్ రావు అనడాన్ని ఆయన తప్పుబట్టారు. బలవంతంగా ఏదైనా చేసుకుంటామంటే జీవోలు ఒప్పుకోవని... జీవోలను అనుసరించే ఏ ప్రభుత్వమైనా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఈ ఉదయం ఓ వార్తా చానల్ లో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం ఏర్పడి ఇంతకాలమైనా... ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టే పనిలోనే కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు ఉన్నారని కృష్ణసాగర్ అన్నారు. పరిపాలించడం చేతకాని కేసీఆర్... రాజకీయాలు చేసుకుంటూనే కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. ఇలా ఎంత కాలం గడుపుతారని... ఏదో ఒక రోజు ప్రభుత్వం చేతగానితనాన్ని ప్రజలు గుర్తిస్తారని అన్నారు. మరికొన్ని రోజులు గడిస్తే... కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేస్తోందన్న కొత్త వాదాన్ని తెర మీదకు తెస్తారని ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రాలతో, కేంద్రంతో సత్సంబంధాలను పెంచుకోకుండా... ఎలా పరిపాలిస్తారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు.

  • Loading...

More Telugu News