: ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ విద్యుత్ కోతలు మొదలయ్యాయి


చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల గ్రామాలకు కూడా దాదాపు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కరెంట్ కష్టాలు పెద్దగా లేవనే చెప్పాలి. రాష్ట్రంలో ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ తో పాటు పలు ప్రైవేటు విద్యుత్ సంస్థల నుంచి ఏపీ సర్కార్ విద్యుత్ ను భారీగా కొనుగోలు చేస్తోంది. వీటితో పాటు, కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిరంతర విద్యుత్ పథకం ద్వారా అందుతున్న విద్యుత్ తో కొన్ని నెలలుగా ఏపీ ప్రజలకు కరెంట్ కష్టాలు పూర్తిగా తప్పాయి. అయితే, రెండు మూడు రోజుల నుంచి ఏపీ లో కూడా విద్యుత్ కోతలు మొదలయ్యాయి శ్రీశైలం కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తిని ప్రభుత్వం నిలిపివేయడంతో ఏపీలో ప్రస్తుతం కరెంటు కొరత ఏర్పడింది. కడప-కర్నూలు జిల్లాలతో పాటు, కృష్ణా డెల్టా పరిధిలో తాగు, సాగునీటి అవసరాల కోసం ప్రభుత్వం శ్రీశైలం కుడిగట్టు ప్రాజెక్టులో విద్యుత్‌ను నిలిపివేసింది. ఫలితంగా- 770 మెగావాట్ల మేర ఉత్పత్తి స్తంభించింది. వీటితో పాటు హుదూద్ తుపాను కారణంగా విశాఖపట్నం సింహాద్రి పవర్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. వాస్తవంగా, ఈ పవర్ స్టేషన్ రోజుకి 2,000 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసేది. కానీ, తుపాను కారణంగా ప్లాంట్ దెబ్బతినడంతో ప్రస్తుతం కేవలం 585 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. అలాగే, బొగ్గు నిల్వలు లేని కారణంగా రోజుకు 1760 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన విజయవాడ థర్మల్ స్టేషన్ ప్రస్తుతం 1219 మెగావాట్ల విద్యుత్ ను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. ఇదే కారణంగా, రోజుకి 1050 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన రాయలసీమ పవర్ స్టేషన్, ప్రస్తుతం 723 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. ఈ కారణాల వల్ల ఒకేసారి పెద్దమొత్తంలో విద్యుత్ ఉత్పత్తి హఠాత్తుగా ఆగిపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ లో కరెంట్ కోతలు తప్పనిసరిగా విధించాల్సిన పరిస్థితి తలెత్తిందని జెన్‌కో అధికారులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఏపీలోని గ్రామాలు, మండలాల్లో దశలవారీగా నాలుగు నుంచి ఆరు గంటల పాటు కోతలను విధించారు. కోతలను అధిగమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ మొత్తంలో విద్యుత్ ను బయటి నుంచి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఒప్పందాలు మరో రెండు మూడు రోజుల్లో కొలిక్కి వస్తాయని, వీటి తర్వాత మళ్లీ నిరంతరాయంగా విద్యుత్ ను అందిస్తామని ఏపీ జెన్ కో అధికారులు చెబుతున్నారు

  • Loading...

More Telugu News