: టీడీపీ తీరు మారకపోతే...నల్లగొండ తరహాలో మరిన్ని దాడులు: టీఆర్ఎస్
తెలుగుదేశం పార్టీ నేతల వ్యవహార సరళిలో మార్పు రాకపోతే, నల్లగొండ తరహాలో మరిన్ని దాడులను చవిచూడాల్సి వస్తుందని టీఆర్ఎస్ హెచ్చరించింది. శ్రీశైలం విద్యుదుత్పత్తి విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదం టీడీపీ, టీఆర్ఎస్ ల మధ్య అగ్గి రాజేసింది. మంగళవారం టీడీపీ కార్యాలయాలపై టీఆర్ఎస్ నేతలు దాడులకు దిగి, వాటికి నిప్పు పెట్టారు. ఈ ఘటనపై టీడీపీ బుధవారం ఘాటుగా స్పందించింది. దీంతో మరోమారు టీఆర్ఎస్ నేతలు టీడీపీ నేతల వ్యాఖ్యలపై పరుష పదజాలంతో హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణ భవన్ జోలికొస్తే, తెలంగాణలో టీడీపీ కార్యాలయాలే లేకుండా చేస్తామని తెలంగాణ మంత్రి మహేందర్ రెడ్డి హెచ్చరించారు. నల్లగొండ టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడిలో తమ ప్రమేయం ఏమీ లేదని, రైతులు, ప్రజలే స్వచ్ఛందంగా పాల్గొన్నారని ఆయన తెలిపారు.