: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా బీజేపీ కసరత్తు ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అయితే, సోమవారం నాడు మహారాష్ట్ర సీఎంగా ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారని ప్రచారం ఊపందుకుంది. గత ఆదివారం నాటి ఫలితాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ మాత్రం సాధించలేకపోయింది. బయటి నుంచే మద్దతిస్తామంటూ ఎన్సీపీ చేసిన ఆఫర్ ను అటు వద్దనలేక, ఇటు కాదనలేక బీజేపీ సందిగ్ధంలో పడిపోయింది. మద్దతు విషయంలో శివసేన నాన్చుడు ధోరణి, ఆ పార్టీని చికాకుకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. సమయం పెరిగేకొద్దీ కొత్త ముఖాలు సీఎం రేసులోకి రావడం సహజం. అయితే, మహారాష్ట్రలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. తొలి నుంచి సీఎం రేసులో ముందువరుసలో ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ను బరి నుంచి వెనక్కు నెట్టే నేత ఇప్పటిదాకా కనిపించలేదు. అంతేగాక, నానాటికీ సీఎంగా ఫడ్నవీస్ అయితేనే బాగుంటుందంటూ పార్టీ శ్రేణులు ఎలుగెత్తుతున్నాయి. ఈ ప్రచారంలో కార్యకర్తలతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మినహాయింపేమీ కాదు. మొన్నటి ఎన్నికల సందర్భంగా ఫడ్నవీస్ అనుసరించిన వ్యవహారసరళి పార్టీ నేతలను విశేషంగా ఆకట్టుకుంది. సీట్ల సర్దుబాటులో మొండికేస్తున్న శివసేనతో తెగదెంపులు చేసుకోవాలని ప్రతిపాదించింది తొలుత ఫడ్నీవీసేనట. ఈ దిశగా నిర్ణయం తీసుకునేందుకు పార్టీకి సహకరించిన ఫడ్నవీస్, ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయం కోసం రచించిన ప్రణాళికలు బాగానే పనిచేశాయి. దీంతో ఎన్నికల్లో ధైర్యంగా అడుగేసేందుకు తోడ్పడి, పార్టీ విజయానికి బాటలు వేసిన ఆయనకే సీఎం పీఠాన్ని అధిరోహించేందుకు అర్హత ఉందని ఆ పార్టీ నేతల వాదన. ఈ క్రమంలోనే ఫడ్నవీస్, వచ్చే సోమవారం మహారాష్ట్ర సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించడం ఖాయమన్న వాదన బలంగా వినిపిస్తోంది.