: చెన్నైలో లాయర్ల చాంబర్లే పెళ్లి మంటపాలు!


మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు. అది ఒరిజినల్ పెళ్లిళ్ల సంగతి. ఇటీవల కాలంలో కొన్ని నకిలీ పెళ్లిళ్లకు చెన్నైలోని లాయర్ల ఛాంబర్లు వేదికలుగా నిలుస్తున్నాయి. నమ్మశక్యం కాకున్నా, ఇది ముమ్మాటికీ నిజం. 2013లో చెన్నై నార్త్, రాయపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో నమోదైన పెళ్లిళ్ల వివరాలు చూస్తే, ఈ దురాగతం కళ్లకు కట్టినట్టు కనబడుతుంది. ఈ వ్యవహారంలో మరో ఆశ్చర్యకర విషయమేంటంటే, వధూవరులిద్దరూ లేకున్నా వారి పెళ్లిళ్లు జరిగిపోయాయి. కొన్ని ప్రయోజనాల కోసం అర్రులు చాచే వ్యక్తులను బుట్టలో వేసుకున్న చెన్నై లాయర్లు, తమ ప్రైవేట్ కార్యాలయాల్లోనే పెళ్లి తంతును ముగిస్తుండగా, సదరు లాయర్ల దౌర్జన్యాలకు బెంబేలెత్తుతున్న రిజిస్ట్రార్లు ఆ వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తున్నారు. ఇటీవల మద్రాస్ హైకోర్టుకు హెబియస్ కార్పస్ పిటిషన్లు భారీగా వచ్చి పడుతున్నాయి. తమ భార్యలను వారి తల్లిదండ్రులు నిర్బంధించారని కొందరు పురుషులు దాఖలు చేసిన ఈ పిటిషన్లతో నోటీసులు అందుకున్న మహిళలు, దిగ్భ్రాంతికి గురయ్యారు. పిటిషన్ వేసిన వ్యక్తి తమకు తెలిసినా, వారితో తమకు పెళ్లి ఎప్పుడైందని కోర్టునే తిరిగి ప్రశ్నించారట. దీంతో, మద్రాస్ హైకోర్టు డివిజన్ బెంచ్ న్యాయమూర్తులు జస్టిస్ రాజేశ్వరన్, ప్రకాశ్ లతో కూడి ధర్మాసనం, దీనిపై సమగ్ర విచారణ చేయాలని తమిళనాడు సీబీసీఐడీ విభాగానికి ఆదేశాలు జారీ చేసింది. దీంతో చెన్నై న్యాయవాదుల గుట్టు రట్టైంది. చెన్నై నార్త్, రాయపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో 2013లో 3,500దాకా పెళ్లిళ్లు రిజిస్టరయ్యాయి. వీటిలో నరసింహన్ అనే న్యాయవాది ఒక్కరే ఏకంగా 676 పెళ్లిళ్లను రిజిస్టర్ చేయించారు. అది కూడా శని, ఆది వారాలతో పాటు ప్రభుత్వ సెలవు దినాలను మినహాయించుకుని మరీ. నకిలీ పెళ్లిళ్ల కోసం వచ్చే వ్యక్తులకు అన్ని ఏర్పాట్లను క్షణాల్లో పూర్తి చేసే చెన్నై న్యాయవాదులు, వేద మంత్రాలను కూడా నేర్చుకున్నారని ఈ కేసును లోతుగా దర్యాప్తు చేసిన సీబీసీఐడీ ఎస్పీ జయగౌరీ చెప్పారు. నకిలీ పెళ్లిళ్లను రిజిస్టర్ చేసేందుకు తిరస్కరించే రిజిస్ట్రార్లను న్యాయవాదులు బెదిరించిన దాఖలాలున్న సీసీటీవీ ఫుటేజీలను కోర్టుకు సమర్పించారు. న్యాయవాదుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్లను మరింత కఠినతరం చేయనుంది.

  • Loading...

More Telugu News