: ఓటమిపాలైన బాక్సర్ రిఫరీకి పంచ్ ఇచ్చాడు... గెలిచిన బాక్సర్ పరార్!
క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ లో జరుగుతున్న యూరోపియన్ యూత్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో ఓ బాక్సర్ తన అక్కసును రిఫరీపై ప్రదర్శించాడు. వివరాల్లోకెళితే... క్రొయేషియాకు చెందిన విడో లోంకార్, లిథువేనియా బాక్సర్ అల్గిర్దాస్ బన్యూలిస్ మధ్య బౌట్ జరిగింది. లోంకార్ పై బన్యూలిస్ పంచ్ ల వర్షం కురిపించడంతో రిఫరీ మాగెజ్ జిర్గాత్ రౌండ్ నిలిపివేసి, కౌంటింగ్ స్టార్ట్ చేశాడు. తదుపరి రౌండ్ కు లోంకార్ అన్ ఫిట్ అంటూ ఆయన బన్యూలిస్ ను విజేతగా ప్రకటించాడు. దీంతో, లోంకార్ లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలెండ్ కు చెందిన ఆ రిఫరీ దగ్గరకు వచ్చి ఎడాపెడా పంచ్ లు కురిపించాడు. దీంతో, రిఫరీ కిందపడిపోయాడు. అటు, లోంకార్ మరో కోణాన్ని చూసిన విజేత బాక్సర్ బన్యూలిస్ రింగ్ నుంచి ఒక్కుదుటున కిందకు దూకి పరుగందుకున్నాడు. ఘటనపై స్పందించిన అధికారులు లోంకార్ ను నిర్బంధించారు. క్రొయేషియా బాక్సింగ్ ఫెడరేషన్ జరిగిన ఘటనపై వరల్డ్ బాక్సింగ్ ఆర్గనైజేషన్, యూరోపియన్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ లకు క్షమాపణ తెలిపింది. అంతేగాకుండా, లోంకార్ పై జీవితకాల నిషేధం విధించింది.