: టెంట్ స్కామ్: 'కేబినెట్ సెక్రటేరియట్, రా'లపై సీబీఐ కేసు
కేంద్రంలో తాజాగా మరో కుంభకోణం వెలుగుచూసింది. రూ.22 కోట్ల విలువైన గుడారాల (టెంట్స్) కొనుగోలుకు సంబంధించిన వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు సీబీఐ నిర్ధారించింది. ఈ క్రమంలో కేబినెట్ సెక్రటేరియట్ అధికారులు, 'రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్' (రా)కు చెందిన వ్యక్తులు , ఓ ప్రైవేటు వ్యాపారవేత్తపై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. అంతేగాక స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ (ఎస్ఎఫ్ఎఫ్)కు అధిక ఎత్తులో ఉండే గుడారాలను సరఫరాచేసే 'సాయి బాబా బిల్డర్స్' ముగ్గురు డైరెక్టర్లపైనా కేసు రిజిస్టర్ అయింది. మరోవైపు ఆ డైరెక్టర్లకు చెందిన ఢిల్లీ, కోల్ కతా ప్రాంగణాల్లోనూ సీబీఐ ఈరోజు సోదాలు చేపట్టింది. 2009-13 సంవత్సరాల్లో కేబినెట్ అధికారులు, ఎస్ఎఫ్ఎఫ్ పదేపదే సదరు బిల్డర్స్ కే గుడారాలు సరఫరా చేసే అవకాశం ఇచ్చి, వారు కోట్ల రూపాయల లాభాలు పొందేందుకు కారణమైనట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దాంతో, ప్రధానమంత్రి కార్యాలయం ఈ విషయంపై దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలో పైవిధంగా చర్యలు తీసుకున్నారు.