: వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియాలో 'నెట్ బౌలర్'
మరికొన్ని నెలల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్త నిర్వహణలో వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఈ మెగా ఈవెంట్ ను లోపరహితంగా చేపట్టాలని ఈ రెండు దేశాల క్రికెట్ బోర్డులు కృతనిశ్చయంతో ఉన్నాయి. ఈ క్రమంలో టోర్నీలో పాల్గొనే జట్లకు ఎలాంటి లోటు రానీయరాదని నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే, ఆయా జట్ల ఆటగాళ్ళ నెట్ ప్రాక్టీసు కోసం స్థానిక బౌలర్లను సిద్ధం చేస్తున్నారు. అందుకోసం ప్రత్యేకంగా 'నెట్ బౌలర్' పేరిట ఓ కార్యక్రమాన్ని రూపొందించారు. సుమారు 1500 మంది నెట్ బౌలర్లు అవసరమవుతారని భావిస్తుండగా, వారి ఎంపిక కోసం గురువారం సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. బ్రిస్బేన్ లోని అలెన్ బోర్డర్ ఫీల్డ్ స్టేడియం ఇందుకు వేదిక. ఈ నెట్ బౌలర్ కార్యక్రమాన్ని ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ పర్యవేక్షించనున్నారు. హై లెవల్ క్లబ్ క్రికెట్ అనుభవమున్న క్రికెటర్లనే ఈ సెలక్షన్స్ కు పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఎంపికైన బౌలర్లు... వరల్డ్ కప్ మ్యాచ్ ల సందర్భంగా ఆయా జట్ల బ్యాట్స్ మెన్ కు నెట్ ప్రాక్టీసులో సహకరిస్తారు. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది.