: మోహన్ బాబుకు 'బెజవాడ గోపాలరెడ్డి' పురస్కారం
నటుడు మోహన్ బాబు కీర్తికిరీటంలో మరో విశిష్ట అవార్డు చేరింది. మంగళవారం నెల్లూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన బెజవాడ గోపాలరెడ్డి అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ, ఈ అవార్డు రావడం సంతోషదాయకమన్నారు. రాజకీయాలు 90 శాతం కలుషితమయ్యాయని అభిప్రాయపడ్డారు. మిగతా 10 శాతం మంచి రాజకీయనేతలున్నారని, అలాంటి వారిలో బెజవాడ గోపాలరెడ్డి ఒకరని పేర్కొన్నారు. అలాంటి నేత పేరిట తనకు అవార్డునివ్వడం గొప్పగా భావిస్తున్నానని తెలిపారు. తమిళనాడు గవర్నర్ రోశయ్య ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. బెజవాడ గోపాలరెడ్డి ఆంధ్ర రాష్ట్రానికి రెండో ముఖ్యమంత్రి. ఈయన స్వాతంత్ర్యోద్యమంలోనూ పాల్గొన్నారు. పదకొండు భాషల్లో ఈయనకు ప్రవేశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రి పదవులు నిర్వహించిన గోపాలరెడ్డి ఉత్తరప్రదేశ్ గవర్నర్ గానూ వ్యవహరించారు.