: కోలీవుడ్ ‘కత్తి’పై తమిళ తంబిల కన్నెర్ర: తమిళనాడు వ్యాప్తంగా ఉద్రిక్తత
ప్రముఖ తమిళ నటుడు విజయ్ నటించిన కోలీవుడ్ చిత్రం ‘కత్తి’ తమిళనాడు వ్యాప్తంగా మంగళవారం ఉద్రిక్తతలకు కారణమైంది. అయంగరన్ ఇంటర్నేషనల్ సమర్పణలో నిర్మితమైన ఈ సినిమా నిర్మాతల్లో ఓ వ్యక్తి శ్రీలంకకు చెందినవారు కావడమే ఇందుకు కారణంగా నిలిచింది. దీపావళిని పురస్కరించుకుని మంగళవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సినిమా విడుదలైన కొద్ది గంటల్లోనే తమిళనాడు వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. తమిళనాడు రాజధాని చెన్నైలో మూడు థియేటర్లపై తమిళులు దాడులు చేసి, విధ్వంసం సృష్టించారు. నిరసనల తీవ్రత గంటగంటకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వం పోలీసు బలగాలను రంగంలోకి దించింది. తక్షణమే ‘కత్తి’ చిత్ర ప్రదర్శనను నిలుపుదల చేయాలని తమిళులు డిమాండ్ చేస్తున్నారు.