: ఆంధ్రప్రదేశ్ కు అదనంగా మరో 200 మెగావాట్ల విద్యుత్ ను మంజూరు చేసిన కేంద్రం
హుదూద్ తుపానుతో పాటు బొగ్గు నిల్వలు లేని కారణంగా విద్యుత్ సంక్షోభంలో చిక్కుకున్న ఏపీని ఆదుకునేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. తుపాను కారణంగా విశాఖపట్టణంలోని సింహాద్రి పవర్ ప్లాంట్ పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. వాస్తవంగా, ఈ పవర్ స్టేషన్ రోజుకి 2,000 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసేది. కానీ, తుపాను కారణంగా ప్లాంట్ దెబ్బతినడంతో ప్రస్తుతం కేవలం 585 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. అలాగే, బొగ్గు నిల్వలు లేని కారణంగా రోజుకు 1760 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన విజయవాడ థర్మల్ స్టేషన్ ప్రస్తుతం 1219 మెగావాట్ల విద్యుత్ ను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. ఇదే కారణంగా, రోజుకి 1050 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేయాల్సిన రాయలసీమ పవర్ స్టేషన్, ప్రస్తుతం 723 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తోంది. వీటితో పాటు భవిష్యత్తులో రాయలసీమకు తాగునీటి ఇబ్బంది రాకూడదన్న ఆలోచనతో ఇటీవల శ్రీశైలం కుడికాల్వ నుంచి జల విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. పర్యవసానంగా ఆంధ్రప్రదేశ్ రోజుకు 3,000 మెగావాట్లు విద్యుత్ లోటును ప్రస్తుతం ఎదుర్కొంటుంది. ఏపీ ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు నాయుడు నిన్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో మాట్లాడారు. ఏపీలో విద్యుత్ పరిస్థితిని వివరించి అదనపు విద్యుత్ ఇవ్వాల్సిందిగా కోరారు. చంద్రబాబు రిక్వెస్ట్ కు పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. సదరన్ గ్రిడ్ లో ఎవరికీ కేటాయించని కోటా నుండి ఆంధ్రప్రదే్శ్ కు 200 మెగా వాట్లను ఆయన మంజూరు చేశారు. దీంతో, మిగతా లోటును పూడ్చటానికి చంద్రబాబు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది.