: వాకతిప్ప ఘటనలో 17కు చేరిన మృతులు... కిలోమీటరు దూరంలో మహిళ శవం
తూర్పుగోదావరి జిల్లా వాకతిప్పలో సోమవారం సంభవించిన పేలుడులో మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. సోమవారం బాణాసంచా తయారీలో చోటుచేసుకున్న పేలుడులో అక్కడికక్కడే 12 మంది చనిపోయారు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలై, అపోలో అస్పత్రిలో చేరినవారిలో మంగళవారం ఉదయం మరో నలుగురు మహిళలు మృత్యువాత పడ్డారు. మరోవైపు ఆచూకీ లభించకుండాపోయిన ఓ మహిళ ఘటనా స్థలానికి కిలోమీటరు దూరంలో విగతజీవిగా పడి ఉండటాన్ని స్థానికులు మంగళవారం ఉదయం గుర్తించారు. ప్రమాదంలో గాయపడ్డ సదరు మహిళ ప్రాణాలను దక్కించుకునేందుకు సుమారు కిలోమీటరు దూరం వరిపొలాల వెంట పరుగు తీసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, సదరు మహిళతో కలసి పనికి వెళ్లిన మరో ఐదుగురు మహిళల ఆచూకీ లభించలేదు. వీరు కూడా చనిపోయి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.