: విద్యుదుత్పత్తిపై తెలుగు రాష్ట్రాల మధ్య తకరారు: శ్రీశైలం ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
శ్రీశైలం ప్రాజెక్టు వద్ద జరుగుతున్న విద్యుదుత్పత్తి ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య వివాదాన్ని రేపింది. శ్రీశైలం కేంద్రంగా రెండు రాష్ట్రాలు జల విద్యుదుత్పత్తి చేస్తున్నాయి. అయితే జలాశయంలో నీటి నిల్వ, భవిష్యత్ సాగు అవసరాలు, విద్యుత్ డిమాండ్ లను సాకుగా చూపుతూ ఇరు రాష్ట్రాలు తమ ప్రయోజనాలను తెరపైకి తెచ్చాయి. భవిష్యత్ సాగు, తాగు నీటి అవసరాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ఇప్పటికే విద్యుదుత్పత్తిని నిలిపేసింది. ఈ మేరకు విద్యుదుత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ సర్కారును కోరింది. అయితే తీవ్ర విద్యుత్ కొరత నేపథ్యంలో విద్యుదుత్పత్తిని నిలిపేది లేదని తెలంగాణ చెబుతోంది. అయితే మరికొంత కాలం విద్యుదుత్పత్తి జరిపితే, జలాశయంలో నీటి నిల్వ తగ్గిపోవడంతో భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఏపీ వాదిస్తోంది. తాజాగా విద్యుదుత్పత్తి కోసం నీటి విడుదలను తక్షణమే నిలిపేయాలని రాయలసీమ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ప్రాజెక్టు వద్ద ఏపీ, తెలంగాణ అధికారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని తెలుస్తోంది.