: కోట్లాది మంది కార్యకర్తలు రాహుల్ నాయకత్వంపై నమ్మకంగా ఉన్నారు: కాంగ్రెస్
దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోవడానికి రాహుల్ గాంధీ నాయకత్వమే కారణమన్న విమర్శలను కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా తప్పుబట్టారు. కోట్లాది మంది కాంగ్రెస్ కార్యకర్తలకు రాహుల్ నాయకత్వంపై పూర్తి నమ్మకముందని ఆయన ప్రకటించారు. సోనియా, రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కు బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉందని కార్యకర్తలు ఇప్పటికీ అనుకుంటున్నారని ఆయన అన్నారు. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని ప్రియాంక గాంధీ నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. ఎన్నికల్లో జయాపజయాలు సర్వసాధారణమని... కాంగ్రెస్ ఇలాంటి ఆటుపోట్లను ఎన్నో ఎదుర్కొని నిలిచిందన్నారు. వరుస పరాజయాల నేపథ్యంలో, కాంగ్రెస్ కచ్చితంగా ఆత్మపరిశీలన చేసుకుంటుందని ఆయన వెల్లడించారు. రాహుల్ ను తప్పించి పార్టీ పగ్గాలు ప్రియాంక గాంధీకి అప్పగించాలని ఢిల్లీలో కొందరు నినాదాలు చేసిన నేపథ్యంలో సుర్జేవాలా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.