: ఉత్కంఠ భరితంగా మహారాష్ట్ర రాజకీయం


మహారాష్ట్రలో బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ... ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు 22 సీట్ల వెనుకబడటం... రాజకీయ వర్గాల్లో హీట్ పెంచుతోంది. బీజేపీతో శివసేన, ఎన్సీపీల చర్చలు ముగిసినప్పటికీ... ఇంకా తుది నిర్ణయం వెలువడ లేదు. ప్రస్తుతం, బీజేపీ మరాఠీ నేత నితిన్ గడ్కరీ నివాసం కేంద్రంగా బీజేపీ మంతనాలు కొనసాగుతున్నాయి. శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలా? లేదా ఎన్సీపీతోనా? అనే విషయంలో బీజేపీ ఎటూ తేల్చుకోలేక పోతోంది. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే తీరుపై కొంత మంది బీజేపీ నేతలు మండిపడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో శివసేనతో చేతులు కలపరాదని వీరు పార్టీ అధిష్ఠానానికి సూచిస్తున్నారు. మరోవైపు, బీజేపీకి బేషరతుగా మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించడం వేడిని మరింత పెంచింది. ఒకవేళ ఎన్సీపీ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే... శివసేనకు తీవ్ర నష్టం వాటిల్లినట్టే అని ఉద్ధవ్ కూడా ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఇదే సమయంలో ఎన్సీపీ మరో విషయాన్ని వెల్లడించింది. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామని కాంగ్రెస్ పార్టీ ఓ ప్రతిపాదనను తమ ముందుకు తీసుకు వచ్చిందని... దాన్ని తాము నిర్ద్వంద్వంగా తిరస్కరించామని తెలిపింది. ఎవరితో కలవాలన్న విషయంపై బీజేపీ అధిష్ఠానం ఇప్పటికే తీవ్ర కసరత్తు చేసింది. కాసేపట్లో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ ముంబయి చేరుకుంటున్నారు. ఈ రాత్రికి ఓ నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News