: చంద్రబాబును కలిసిన కృష్ణ, విజయనిర్మల
సచివాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీనటులు కృష్ణ, విజయనిర్మల కలిశారు. హుదూద్ తుపాను బాధితుల సహాయార్థం హీరో మహేష్ బాబు ప్రకటించిన రూ. 25 లక్షలకు... తమ విరాళం మరో రూ. 25 లక్షలను కలిపి మొత్తం రూ. 50 లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. ఇదే సమయంలో, అమర్ రాజా బ్యాటరీస్ తరపున రూ. కోటి చెక్కును చంద్రబాబుకు గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ అందజేశారు. అంతేకాకుండా, ఎంపీ లాడ్స్ నుంచి మరో రూ. 25 లక్షలను జయదేవ్ కేటాయించారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, తుపాను వల్ల విశాఖకు తీరని నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. మానవతా వాదులందరు ముందుకు వచ్చి... తుపాను బాధితులను ఆదుకోవడానికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. దివిసీమ ఉప్పెన సంభవించినప్పుడు కూడా... సినీ పరిశ్రమ పెద్దల నుంచి విరాళాలు సేకరించి, బాధితులను ఆదుకున్నానని చెప్పారు. మహేష్ హాంకాంగ్ లో షూటింగ్ లో ఉండటంవల్ల ఇక్కడకు రాలేకపోయాడని తెలిపారు.