: నిర్మాతల మండలి సమావేశంలోకి చొచ్చుకెళ్లిన టీ.డ్యాన్సర్లు, విద్యార్థులు
రాష్ట్రం రెండు ముక్కలైనా సినీ పరిశ్రమ మాత్రం ఇంకా ఒకటిగానే ఉంది. పరిశ్రమను ఆంధ్ర, తెలంగాణ విభాగాలుగా విడదీయాలంటూ గత కొంత కాలంగా ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. వేరు కుంపటి పెట్టుకునేందుకు తెలంగాణ నిర్మాతలు ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో, సినీ పరిశ్రమలో మరో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. సినిమాల్లో తమకు సరైన అవకాశాలు ఉండటం లేదని తెలంగాణ ప్రాంతానికి చెందిన డ్యాన్సర్లు కొంత కాలంగా ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ రోజు వీరంతా హైదరాబాదులో ఆందోళనకు దిగారు. వీరికి ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్థులు కూడా తోడవడంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నిర్మాతల మండలి సమావేశం జరుగుతుండగా... మీటింగ్ హాల్ లోకి డ్యాన్సర్లు, విద్యార్థులు చొచ్చుకెళ్లారు. మరోవైపు, తమ వేతనాలను పెంచాలంటూ సినీ కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఇన్ని సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతున్న తెలుగు సినీ పరిశ్రమ భవిష్యత్తు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో వేచి చూడాలి.