: మహిళల క్రికెట్ ను బీసీసీఐ పట్టించుకోవడంలేదంటున్న గవాస్కర్ సోదరి
దేశంలో మహిళల క్రికెట్ ను బీసీసీఐ పట్టించుకోవడంలేదని భారత మహిళా క్రికెట్ సంఘం (డబ్ల్యూసీఏఐ) గౌరవ కార్యదర్శి నూతన్ గవాస్కర్ ఆరోపిస్తున్నారు. నూతన్ భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తోబుట్టువు. మాజీ క్రికెటర్ కూడా. మధురలో మీడియాతో మాట్లాడుతూ, బీసీసీఐలో డబ్ల్యూసీఏఐని విలీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. 2006లో ఐసీసీ ఇచ్చిన ఆదేశాల మేరకు బీసీసీఐలో మహిళల క్రికెట్ సంఘాన్ని కలిపేసుకోవాలని, ఆ విలీన ప్రక్రియ కోసం ఐసీసీ పరిశీలకులను పంపాలని నూతన్ కోరారు. బీసీసీఐ కేవలం రెండు డజన్ల మంది మహిళా క్రికెటర్లనే పరిగణనలోకి తీసుకుందని, ఇంకా 100 మందికి పైగా ప్రతిభావంతులైన మహిళా క్రికెటర్లు దేశంలో ఉన్నారని వివరించారు. బీసీసీఐ తమపై సవతి ప్రేమ చూపుతోందని ఆరోపించారు.