: అమాయకుడిని చేసి ఫోన్ తో ఉడాయించాడు!
పిల్లలంటే విపరీతమైన ఇష్టంతో విలువైన వస్తువులు కొనిపెడుతుంటాం. కానీ వారు తమ అమాయకత్వంతో వాటిని పోగొట్టుకోవడం తెలిసిందే. పెద్దవాళ్లే మోసగాళ్లబారిన పడి జేబులు గుల్లచేసుకుంటారు. ఇక పిల్లలు ఏం చేయగలరు? ఈ కోవలో ఓ టీనేజర్ ను దొంగ ఎలా మోసం చేశాడో చదవండి. హైదరాబాదులోని హిమాయత్ నగర్ లో వాసవి స్కూల్ లో చదువుతున్న తనిష్క్ (15) మోపెడ్ కు స్టిక్కరింగ్ చేయించుకునేందుకు కింగ్ కోఠివైపు వెళ్తుండగా, ఆగంతుకుడు బైక్ పై వచ్చి "నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ మా అబ్బాయిది" అంటూ ఆపాడు. దీంతో, ఆందోళన చెందిన తనిష్క్ "కాదు అంకుల్ ఇది నా ఫోనే" అంటూ సమాధానం ఇచ్చాడు. "మా అబ్బాయి ఫోన్ ఎవరో ఎత్తుకెళ్లారు, ఓ సారి నీ ఫోన్ ఇవ్వు చెక్ చేయించి తీసుకొస్తాను" అంటూ ఆ ఆగంతుకుడు ఫోన్ తీసుకున్నాడు. వెళ్లిన వ్యక్తి ఎంతకూ తిరిగిరాకపోవడంతో బాలుడు తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం వివరించాడు. దీంతో, వారు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ విలువ 20 వేల రూపాయలని వారు తెలిపారు.