: 400 కోట్ల రూపాయలకు విండీస్ పై బీసీసీఐ దావా!
క్రికెటర్ల తిరుగుబాటుతో తలపట్టుకున్న వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు టీమిండియా తాజా నిర్ణయం... గోరు చుట్టుపై రోకలి పోటులా పరిణమించనుంది. భారత పర్యటన నుంచి అర్ధంతరంగా వెస్టిండీస్ జట్టు స్వదేశానికి వెళ్లిపోవడంతో ఆ క్రికెట్ బోర్డుపై బీసీసీఐ ప్రతీకార చర్యలకు రంగం సిద్ధం చేస్తోంది. సిరీస్ రద్దు చేసుకోవడంతో తమకు కలిగించిన నష్టానికి 400 కోట్ల రూపాయలు చెల్లించాలని దావా వేయనుంది. ఈమేరకు ఈనెల 21న హైదరాబాద్‌లో జరిగే బోర్డు వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. షెడ్యూల్ ప్రకారం ఇరు జట్ల మధ్య ఐదు వన్డేలు, ఒక టి20, మూడు టెస్టులు జరగాల్సి ఉండగా, విండీస్ ఆటగాళ్లు, బోర్డు విభేదాల కారణంగా నాలుగో వన్డే అనంతరం టూర్‌ను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్‌లు జరగాల్సిన 17 రోజుల ఆదాయాన్ని (మూడు టెస్టులకు 15 రోజులు, ఒక వన్డే, ఒక టి20) బీసీసీఐ కోల్పోయింది. శ్రీలంక జట్టును ఐదు వన్డేల సిరీస్‌కు ఆహ్వానించి దీనిని పూరించేందుకు ప్రయత్నించినప్పటికీ, 12 రోజుల ఆదాయానికి గండి పడింది. విండీస్‌తో సిరీస్‌లో ప్రతీ మ్యాచ్ ద్వారా బోర్డుకు రోజుకు దాదాపు 33 కోట్ల రూపాయల ఆదాయం సమకూరేది. సిరీస్ రద్దు నేపథ్యంలో బీసీసీఐకి నష్టం 396 కోట్ల రూపాయలని పేర్కొంది. ఈ మొత్తం విండీస్ బోర్డు నుంచి ముక్కుపిండి వసూలు చేసేందుకు డబ్ల్యుఐసీబీపై దావా వేయాలని బీసీసీఐ నిర్ణయించింది.