: జూడాలు గ్రామీణ ప్రాంతాల్లో సేవలందించాల్సిందే: తెలంగాణ డిప్యూటీ సీఎం రాజయ్య స్పష్టీకరణ
జూనియర్ డాక్టర్లు విధిగా గ్రామీణ ప్రాంతాల్లో సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం రాజయ్య స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో సర్వీసులపై అసెంబ్లీలో చట్టం కూడా చేశామని, ఇప్పుడు దాన్ని మార్చాలంటే అఖిలపక్షంలోనైనా, క్యాబినెట్లోనైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని, ఇలాంటి పరిస్థితుల్లో జూనియర్ డాక్టర్ల సమ్మెను తీవ్రంగా పరిగణించామని రాజయ్య వివరించారు. చర్చలకు పిలిస్తే, జూనియర్ డాక్టర్లు కానివారు కూడా వస్తున్నారని, జూడాల సంఘంలో సభ్యత్వం ఉన్నావారు మాత్రమే చర్చలకు రావాలని సూచించారు. పెద్దలంటే గౌరవం లేకుండా, వేలు చూపించి మాట్లాడుతున్నారని రాజయ్య జూనియర్ డాక్టర్ల తీరును విమర్శించారు. జూడాలు గ్రామీణ సర్వీసులను తిరస్కరించడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు.