: కాంగ్రెస్ తో కలవడానికైనా సిద్ధమే: శివసేన సంకేతాలు


25 ఏళ్లపాటు బీజేపీతో కలసి పనిచేసిన శివసేన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేసింది. మహారాష్ట్రలో మోడీ హవా బాగా పనిచేస్తోందని... శివసేన, కాంగ్రెస్ లను అధిగమించి బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చి చెప్పాయి. ఇది శివసేనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలాగైనా అధికారం చేపట్టాలనే యోచనలో కొత్త స్నేహాలకు తెరలేపేందుకు సైతం సిద్ధమవుతోంది. ఎన్నికల ఫలితాలు వెల్లడయిన తర్వాత అలయెన్స్ లకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అవుతోంది. అవసరమైతే తన బద్ధ విరోధి కాంగ్రెస్ తో జతకట్టేందుకు కూడా వెనుకాడటం లేదు. "మహారాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని... ఏ పార్టీతో అయినా జతకట్టేందుకు సిద్ధం. ఆయా పార్టీల సిద్ధాంతాలతో మేము ఏకీభవించనప్పటికీ వారితో కలుస్తాం" అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ తో చేయికలపడానికి కూడా తాము సిద్ధమే అన్న సంకేతాలు ఇచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీని శివసేన బద్ధ శత్రువుగా భావించింది. నరేంద్ర మోడీని పై విమర్శల వర్షం కురిపించేందుకు కూడా వెనుకాడలేదు. బీజేపీ కూడా శివసేననే ఎక్కువగా టార్గెట్ చేసింది.

  • Loading...

More Telugu News