: మహారాష్ట్ర, హర్యానాల్లో ప్రారంభమైన ఓట్ల లెక్కింపు... సర్వత్ర ఉత్కంఠ
బీజేపీ, కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలకు... శివసేన, లోక్ దళ్, ఎన్సీపీ లాంటి ప్రాంతీయ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఈ ఉదయం 8 గంటలకు ఇరు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహారాష్ట్రలో 288 స్థానాలకు, హర్యానాలో 90 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. మధ్యాహ్నం సమయానికల్లా ఫలితాల సరళి తెలిసిపోనుంది. 3 గంటల వరకు తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లోనూ, బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించబోతోందని ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. మహారాష్ట్రలో ఇప్పటిదాకా పెద్దన్న పాత్ర పోషించిన శివసేనకు మొదటి సారి తన పాత నేస్తం బీజేపీ చెక్ పెట్టబోతోందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇదే జరిగితే మరాఠా గడ్డ మీద శివసేన ప్రాభవం తగ్గినట్టే. మరోవైపు, హర్యానాలో అధికార కాంగ్రెస్ పార్టీకి చావుదెబ్బ తప్పదనే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రజా వ్యతిరేకత, మోడీ హవాతో ఇక్కడ కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తప్పదని అంచనా వేస్తున్నారు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే... తన ఛరిష్మాతో బీజేపీని కేంద్రంలో కూర్చోబెట్టిన మోడీకి కూడా ఈ ఎన్నికలు కీలకమే. ఈ రెండు రాష్ట్రాల్లోనూ జయభేరి మోగిస్తేనే... మోడీపై ప్రజల నమ్మకం, విశ్వాసం కొనసాగుతోందని భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.