: మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఎప్పుడు, ఎందుకు నమోదయిందో తెలుసా?
ఎఫ్ఐఆర్ నమోదయితే కానీ ఏ కేసు దర్యాప్తూ ప్రారంభం కాదన్న విషయం తెలిసిందే. ఒక్కసారి ఎఫ్ఐఆర్ నమోదయితే... ఆ కేసు అంతు చూసేంతవరకు మధ్యలో ఆపే అవకాశం కూడా ఉండదన్న సంగతీ తెలిసిందే. చివరకు సెటిల్ మెంట్ తోనే, కోర్టు తీర్పుతోనే కేసు ముగుస్తుంది. నేర విభాగానికి సంబంధించి అంత గొప్పది ఎఫ్ఐఆర్. మన దేశ రాజధానిలో నమోదైన తొలి ఎఫ్ఐఆర్ గురించి కొన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం. 1861 అక్టోబర్ 18న ఉత్తర ఢిల్లీలోని సబ్జీ మండీ పోలీస్ స్టేషన్ లో తొలి ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇండియన్ పోలీస్ యాక్ట్-1861 అమల్లోకి వచ్చిన తర్వాత నమోదైన తొలి ఎఫ్ఐఆర్ ఇది. మరో గొప్ప విషయం ఏమిటంటే... ఏ భయంకరమైన నేరానికి సంబంధించో ఈ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు. హుక్కా, వంట పాత్రలు, కుల్ఫీ దొంగలించిన ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదయింది. మరో విషయం ఏమిటంటే, అపహరణకు గురైన వస్తువుల విలువ 45 అణాలు. మయీయుద్దీన్ అనే వ్యక్తి ఈ కేసు పెట్టారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ను ఉర్దూలో రాశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం... ఒక హుక్కా, మూడు పెద్ద వంట పాత్రలు, మూడు చిన్న వంట పాత్రలు, ఒక గిన్నె, ఒక కుల్ఫీ, కొన్మి మహిళల దుస్తులు అపహరణకు గురయ్యాయి. ఈ వివరాలను ఢిల్లీ ఉత్తర విభాగం డిప్యూటీ పోలీస్ కమిషనర్ మధూర్ వర్మ వెల్లడించారు. చరిత్రాత్మకమైన ఈ ఎఫ్ఐఆర్ కు ఫ్రేమ్ కట్టించి సబ్జీ మండీ పోలీస్ స్టేషన్ లో నిన్న ఉంచారు. ఈ ఎఫ్ఐఆర్ ను మ్యూజియంలో ఉంచబోతున్నారు. పోలీసు రికార్డుల ప్రకారం, 1861లో ఢిల్లీలో కేవలం 5 పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉండగా... అందులో సబ్జీ మండీ పీఎస్ ఒకటి. సబ్జి మండీ పీఎస్ లో ఆ కాలంలో పలు ఆసక్తికర ఘటనల్లో ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. 1895లో గాడిదను దొంగతనం చేసిన ఘటనలో ఒక ఎఫ్ఐఆర్ నమోదయింది. 11 బత్తాయి పండ్లను అపహరించిన ఘటనకు సంబంధించి 1891లో మరో ఎఫ్ఐఆర్ నమోదయింది. నాలుగు అణాలు దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా ఓ వ్యక్తి పట్టుబడిన ఘటనకు సంబంధించి 1894లో మరో ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఇలాంటి ఎఫ్ఐఆర్ లు ఈ పీఎస్ లో మరెన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్ మెంట్ కు విలువైన ఆస్తులని అధికారులు అంటున్నారు.