: శివసేనకు ఓటేయలేదని...కిరోసిన్ పోసి నిప్పంటించారు: మహారాష్ట్రలో దారుణం
ఎన్నికల్లో ఓట్ల కోసం రాజకీయ పార్టీలు జిత్తులమారి ఎత్తులు వేయడం సహజమే. మొన్నటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఏపీలో రెండు ప్రధాన రాజకీయ పార్టీలు తమకు ఓట్లేయలేదని భావించిన వారిపై దాడులకు దిగిన వైనాన్నీ చూశాం. తాజాగా ఈ ఘటనలను తలదన్నేలా మహారాష్ట్రలో దారుణం చోటుచేసుకుంది. శివసేన అభ్యర్థికి ఓటేయలేదని ఆరోపిస్తూ ముగ్గురు వ్యక్తులు 65 ఏళ్ల మహిళపై హత్యాయత్నం చేశారు. వృద్ధురాలి ఒంటిపై కిరోసిన్ పోసిన నిందితులు ఆ తర్వాత ఆమెకు నిప్పు పెట్టారు. అయితే 80 శాతం కాలిన గాయాలతో బాధితురాలు నాసిక్ సివిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నాసిక్ సమీపంలోని బాబుల్గావ్ ఖుర్ద్ లో గురువారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనలో జెలుబాయి జగన్నాథ్ వాబ్లే అనే వృద్ధురాలిపై అశోక్ బొర్నారే, పాండురంగ బొర్నారే, నందకిషోర్ భూరక్ లనే ముగ్గురు వ్యక్తులు ఆమె ఇంటిలోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. వాబ్లే వాంగ్మూలంతో నిందితులను పోలీసులు కోర్టు ముందు హాజరుపరిచి, విచారణ నిమిత్తం కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వంట చేస్తున్న క్రమంలోనే తమ తల్లి అగ్ని ప్రమాదానికి గురయ్యారని బాధితురాలి కొడుకు చెబుతున్నాడు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి వాస్తవాలను వెలికితీస్తామని పోలీసులు చెబుతున్నారు.