: ఈ దున్న... రూ.7 కోట్ల ధర పలికింది!
అవును, ప్రస్తుతం 1,400 కేజీల బరువుతో రాజభోగాలు అనుభవిస్తున్న ముర్రా జాతి దున్న కోసం ఛండీగఢ్ కు చెందిన ఓ రైతు అక్షరాల రూ.7 కోట్లు చెల్లించేందుకు సిద్ధపడ్డాడట. అయితే ‘యువరాజు’ అంటూ అపురూపంగా పిలుచుకునే ఈ దున్నను విక్రయించేందుకు మాత్రం దాని యజమాని కురంవీర్ సింగ్య అంగీకరించలేదట. ఎందుకంటే, ఆ దున్న ద్వారా సింగ్, ఏటా రూ. 50 లక్షల దాకా సంపాదిస్తున్నాడు మరి. ఎలాగంటే, యువరాజు వీర్యాన్ని విక్రయించేసి ఆయన ఈ మేర భారీ రాబడిని మూటగట్టుకుంటున్నారు. యువరాజు తల్లి అయిన గేదె రోజుకు 25 లీటర్ల పాలిచ్చేది. దీంతో యువరాజు వీర్యానికి భారీ గిరాకీ వెల్లువెత్తుతోంది. ఉత్తరాది రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయని సింగ్ చెబుతున్నారు. ఇంత డిమాండ్ ఉన్న యువరాజు కోసం సింగ్ కూడా రోజూ భారీగానే ఖర్చు చేస్తున్నారులెండి. 14 అడుగుల పొడవు, 5.9 అడుగుల ఎత్తున్న యువరాజు, రోజు 20 లీటర్ల పాలు తాగేస్తోందట. 5 కేజీల యాపిల్ పళ్లతో పాటు 15 కిలోల అత్యంత నాణ్యమైన దాణాను సింగ్, యువరాజుకు అందిస్తున్నారు. ఇలా రోజుకు యువరాజు తిండికోసం రూ.25 వేల మేర ఖర్చు చేస్తున్న సింగ్, దానితో నాలుగు కిలోమీటర్ల దూరం వాకింగ్ కూడా చేయిస్తున్నారు.